Engineering Career: ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ తో మంచి భవిష్యత్తు! 15 d ago

ఇంటర్మీడియట్ (ఎంపీసీ) తర్వాత ఇంజినీరింగ్ కెరీర్ ను ఎంచుకున్న విద్యార్ధులు, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రాసే ఏకైక ప్రవేశ పరీక్ష ఎంసెట్. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇతర కోర్సుల్లో చేరేందుకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇక జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మక సంస్ధలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీల్లో చేరేందుకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ఐశాట్, బిట్‌శాట్ మొదలైనవి ఉన్నాయి.
ఏదైనా ఒక దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి కారకులు ముఖ్యంగా చెప్పుకునే వారు ఇంజినీర్లు. అందుకనే ఇంజినీర్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్ తర్వాత అధికశాతం విద్యార్ధుల దృష్టి అంతా ఇంజినీరింగ్ మీదే ఉంటుంది. ఇంజినీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం సరైన నిర్ణయమే కావచ్చు. కాకపోతే విద్యార్ధులకు ఆసక్తి ఉన్న నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకోవాలి. బ్రాంచిని ఎలా ఎంచుకోవాలి, అసలు ఇంజినీరింగ్లో డిమాండ్ ఉన్న ప్రధానమైన బ్రాంచీలు ఏవి? వంటి విషయాల గురించిన సమాచారం తెలుసుకుందాం.
ఆసక్తి...అభిరుచి ఉంటే మంచి భవిష్యత్తు!
ఇంజినీర్‌గా జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్, బిట్స్ తదితర సంస్ధలు, రాష్ట్రంలోని జేఎన్‌టీయూ వివిధ రకాల ఇంజినీరింగ్ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా డిమాండ్ ఉన్నవి..
• సివిల్ ఇంజినీరింగ్
• మెకానికల్ ఇంజినీరింగ్
• ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
• ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
• సీఎస్ఈ
ఇంజినీరింగ్ అంటే మొదటి నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. వీటినే కోర్ బ్రాంచీలని కూడా అంటున్నారు. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ లాంటి బ్రాంచీలు దశాబ్ధాల కిందటివైనా వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణం, నీటివనరుల పరిశోధన, నిర్వహణ రంగాలకు సివిల్ ఇంజినీరింగ్ విస్తరించింది. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చాలా ముఖ్యమైన స్పెషలైజేషన్‌గా మారింది. ప్రాజెక్టులు, బహుళ అంతస్టుల భవనాలు, రోడ్ల విస్తరణపై ప్రభుత్వాల శ్రద్ధ పెరుగుతోంది. ఎక్కువగా కంప్యూటర్ ఆధారిత డిజైనింగ్ ఆచరణలో ఉంది. అందువల్ల అభ్యర్ధులు క్యాడ్, క్యామ్ లాంటి సామర్ధ్యాలు నేర్చుకోవాలి. సాయిల్ మెకానిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్స్ స్పెషలైజేషన్లకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుండటం వల్ల అభ్యర్ధులకు అవకాశాలు పెరుగుతున్నాయి.
మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ః భారీ పరిశ్రమల ఏర్పాటు, ఆటో మొబైల్ రంగం విస్తరించడం, వాటి నిర్వహణ తదితర అంశాల్లో మెకానికల్ ఇంజినీర్ల భాగస్వామ్యం తప్పనిసరి. విద్యార్ధులు మెకానికల్, సివిల్ బ్రాంచీలు తీసుకోవాలనుకుంటే మ్యాథ్స్‌లో పట్టు ఉండాలి. విద్యార్ధి సృజనాత్మకంగా ఆలోచించగలగాలి.
ఎలక్ట్రానిక్స్ః రోజురోజుకీ విస్తృతమవుతోన్న ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్, తయారీ పరిశ్రమల్లో నిపుణుల కొరతను ఈసీఈ బ్రాంచి తీరుస్తోంది. విద్యార్ధులు బాగా ఇష్టపడే బ్రాంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్మూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ). ఈసీఈ బ్రాంచి ను తీసుకునే విద్యార్ధులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పట్టుండాలి. బీటెక్ పూర్తి చేస్తే మనదేశంలో, విదేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ): సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌లలో ఏ విభాగానికైనా తేలిగ్గా మారడానికి వీలున్న బ్రాంచి ఈఈఈ. ఈ బ్రాంచిలో చేరాలనుకునే విద్యార్ధులకు ఆసక్తి ఉండాలి అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండాలి. మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో ఎక్కువగా ఉద్యోగాలుంటాయి.
సీఎస్ఈ, ఐటీః ఐటీ రంగం సేవలు ఇతర రంగాలకు కూడా విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్ధులు సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలపైనే దృష్ఠి పెట్టాల్సిన అవసరం లేదు. లీగల్ రీసెర్చ్, అకౌంటెన్సీ, ట్రావెల్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లో కూడా ఇంజీనీరింగ్ (సీఎస్ఈ, ఐటీ) విద్యార్ధులకు అవకాశాలు లభిస్తున్నాయి. వీటితోపాటు బయోలాజికల్, ఆర్కిటెక్చరల్, బయో కెమికల్, ఏరో స్పేస్, అగ్రికల్చరల్, కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్, ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఓషన్, పెట్రోలియం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తదితర బ్రాంచీలున్నాయి.
ప్రవేశ పరీక్షలు & కోర్సులు:
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్ధల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షే ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎంసెట్). బీఈ/బీటెక్, బీవిఎస్‌సి అండ్ ఎహెచ్/ బీఎస్సీ(అగ్రి)/బీఎస్సీహార్టికల్చర్/బీఎఫ్ఎస్‌సీ/బీటెక్ (ఎఫ్ఎస్ అండ్ టి)/బీఎస్‌సీ (సిఏ అండ్ బి.ఎం), బీ.ఫార్మా/బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మా-డి.
జాతీయ స్ధాయిలో ఇంజినీరింగ్ చేయాలంటే:
ఇంజినీరింగ్‌లో డిగ్రీ కోర్సులను జాతీయ స్ధాయిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, బిట్స్ లాంటి సంస్ధలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి అఖిల భారత స్ధాయిలో ప్రవేశ పరీక్షలు రాయాలి.
ఐఐటీ-జేఈఈ: బీ.ఈ., బీటెక్, బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో అభ్యర్ధులను చేర్చుకోవడానికి ఈ పరీక్ష జాతీయస్ధాయిలో జరుగుతుంది. ఈ పరీక్షకు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులుండాలి.
బిట్‌శాట్: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో బీఆర్క్, బీ.ఫార్మ్ ఆనర్స్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్ మార్కులు ఉండాలి.
ఐశాట్ః ఎయిరోస్పెస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సైన్సెస్‌లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులను మొదటి సారి రాసని పరీక్షల్లోనే పొందాలి. అలాగే పదోతరగతి అన్ని సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులు ఉండాలి.
యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియంః డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ సంస్ధ అరుదైన ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సులను నిర్వహిస్తోంది. ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ సిస్టమ్స్, రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్స్, పైప్‌లైన్స్, జియో-సైన్సెస్, ఏరో స్పేస్, ఆటోమోటివ్ డిజైన్, మెకట్రానిక్స్, ఐటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదలైన విభాగాలు బీటెక్‌లో ఉన్నాయి. వీటిలో చేరేందుకు సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాం మార్కులు అవసరం. టెన్త్‌లో కూడా 60 శాతం ఉండాలి. జాతీయ స్ధాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్ధులను చేర్చుకుంటారు.
బ్రాంచి ఎంపికలో విద్యార్ధి ఆసక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజినీరింగ్ లాంటి వృత్తివిద్యా కోర్సులో, తర్వాత కెరీర్‌లో రాణించాలంటే సంబంధిత సబ్జెక్టుపై అభ్యర్ధికి ఆసక్తి, ఆ రంగంలో ఏదో ఒకటి సాధించాలే తపన ఉండాలి. అభ్యర్ధుల ఆసక్తి, అభిరుచిలో తేడాలు తప్ప బ్రాంచీలకు లభించే అవకాశాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఏమీ ఉండవు. ఇంజినీరింగ్‌లో కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి కష్టపడి చదవాల్సిందే. కనీసం 70 శాతం మార్కులు సాధించిన వారికే భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం 60 శాతం మార్కులైనా సాధించకపోతే ఇంజినీరింగ్ చేసి ప్రయోజనం ఉండదు.
ఉద్యోగావకాశాలు:
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీలతో ఇంజినీరింగ్ చేసిన వారికి కేవలం ప్రైవేటు రంగంలోనే కాదు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు అభిస్తున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ, గ్రూప్ 1,2, తదితర పరీక్షలకు వీరు హాజరు కావచ్చు.
ఇది చదవండి: యూజీసీ నెట్.. మీ కెరీర్ కోసం సరైన మార్గం