Border-Gavaskar Trophy: 26వ తేదీ నుండి మెల్‌బోర్న్ లో నాలుగవ టెస్టు షురూ... 13 d ago
ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి ప్రదర్శన 3 మ్యాచ్లు.. 126 పరుగులు.. 31.5 సగటు.. ఇది. తన లాంటి గొప్ప బ్యాటర్ నుంచి జట్టు, అభిమానులు ఆశించే ప్రదర్శన కాదిది. అందులోనూ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి లేని, అనుకూల పరిస్థితుల మధ్య సాధించిన సెంచరీని మినహాయించి చూస్తే విరాట్ ప్రదర్శన పేలవం. సిరీస్ గమనాన్ని నిర్దేశించే నాలుగో టెస్టులో అయినా కోహ్లి ఫామ్ అందుకోవాలని, తన స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి అతనాడబోయేది తనకు అచ్చొచ్చిన వేదిక కావడంతో విరాట్ ఆట మారుతుందనే ఆశతో ఉన్నారు.
ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో ఆడిన మూడు టెస్టుల్లో ఈ స్టార్ బ్యాటర్ 52.66 సగటుతో 316 పరుగులు సాధించాడు. అందులో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2014లో ఇక్కడ సాధించిన 169 ఇన్నింగ్స్ విరాట్ పేరు మార్మోగిపోయింది. ఇదే మైదానంలో విరాట్, క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్నది మెల్బోర్న్ టెస్టే నిర్దేశించనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుపై ఆశలుంటాయి. ఇలాంటి కీలక మ్యాచ్లో కోహ్లి ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరం.