Engineering Career: ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాల గైడెన్స్.! 13 d ago

ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి అయినా నైపుణ్యం ప్రధానం..
నూతన విద్యా విధానంలో సాంకేతిక విద్యార్థులు మేజర్, మైనర్ డిగ్రీలు పొందవచ్చు. ఇంజినీరింగ్‌లో ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీల విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి మైనర్ డిగ్రీలు చేయవచ్చు. 5వ సెమిస్టర్ ముగిసే నాటికి, వారు తమ బ్రాంచిలో 70% మార్కులు సాధించాలి. 6, 7 సెమిస్టర్లలో మైనర్ డిగ్రీలు పొందవచ్చు, 8వ సెమిస్టర్ పూర్తయ్యే నాటికి మేజర్ డిగ్రీ అందించబడుతుంది. ఏ బ్రాంచిలో చదివినా, నైపుణ్యం ఉన్న విద్యార్థులు మేజర్, మైనర్ డిగ్రీలు పొందవచ్చు. ఈఈఈ, మెకానికల్, సివిల్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌లో ఆసక్తి ఉంటే, ఈ దిశగా అడుగులు వేయడం మంచిది. లేదా కోర్ బ్రాంచిలో అవసరమైన నైపుణ్యాలను ప్రారంభం నుంచే పొందాలి.
నైపుణ్యాలే సోపానాలు!
ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు మంచి జీపీఏ పొందడం అవసరం, ఎందుకంటే ఇది ఉపకారవేతనాలు, ప్లేస్మెంట్స్, ఉన్నత విద్యావకాశాలను పొందడంలో సహాయపడుతుంది. అందుకే, ఇంజినీరింగ్ విద్యను నాలుగు సంవత్సరాల పాటు శ్రద్ధగా చదవాలి.
రెండో సంవత్సరంలో, విద్యార్థులు నిర్దిష్ట అంశాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. వారి స్పెషలైజేషన్ ప్రకారం ప్రాధాన్యత అంశాలను గుర్తించి, వాటిలో నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇది వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు ప్రాజెక్టు అంశాలను లోతుగా పరిశీలించడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి, విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్ మరియు స్పెషలైజేషన్‌పై దృష్టి సారించాలి.
లోతైన సాంకేతిక పరిజ్ఞానం
సాంకేతిక అంశాలపై విద్యార్థులు మరింత అధ్యయనం చేయాలి. ఎలక్టివ్ సబ్జెక్టులకు అవసరమైన ప్రాధమిక పరిజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయి పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో పరిజ్ఞానం కోసం అధ్యాపకుల సహాయంతో ల్యాబ్‌లలో విస్తృత పరిశోధన, విద్యార్థుల సబ్జెక్ట్ క్లబ్బుల్లో పాల్గొనడం అవసరం.
చిన్నచిన్న ప్రాజెక్టులు
చిన్న చిన్న ప్రాజెక్టుల్లో పాల్గొని వాటిని అమలు చేయడం ప్రారంభించాలి. దీని ద్వారా ప్రాజెక్టులపై లోతైన అవగాహన మరియు ప్రాక్టికల్ పరిజ్ఞానం అందుతుంది. రోటో టైపులను అభివృద్ధి, హ్యాకథాన్లలో పాల్గొనడం, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు సహకరించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయి.
టెక్నికల్ క్లబ్బుల్లో చేరడం
టెక్నికల్ క్లబ్బులు నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి మంచి వేదికలు. సాంకేతిక సబ్జెక్టుకు సంబంధించి కాలేజీలో ఉన్న క్లబ్బులను పరిశీలించి, అవసరమైన వాటిలో చొరవగా భాగస్వామ్యం చేయడం మంచిది. వాటిలో చేరడం ద్వారా కోడింగ్, ఇన్నోవేషన్ బృందాలతో కలిసి పాల్గొనవచ్చు. రోబోటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ క్లబ్బులు విద్యార్థుల నైపుణ్యాలను రెట్టింపు చేస్తాయి. అలాగే నిష్ణాతులతో చర్చించడానికి ఉపయోగపడతాయి. వాటిలో విరివిగా పాల్గొనడం మంచిది.
పరిశ్రమల్లో ఆధునిక సాంకేతికత కారణంగా పెద్ద మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడానికి నేటి ఇంజినీరింగ్ విద్యార్థులు విభిన్న అంశాల్లో నైపుణ్యం సాధించడం అనివార్యమైంది. బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా సంవత్సరాల్లో ఏ అంశాలపై దృష్టి సారించాలో తెలుసుకుందాం!
కోడింగ్ వేదికలు
కోడింగ్ వేదికలను సమర్థంగా ఉపయోగించడం ద్వారా ప్రాక్టీస్ మెరుగుపడుతుంది, ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు కలుగుతాయి. అందుకే, వివిధ కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో చొరవతో పాల్గొనాలి. దీనివల్ల అల్గారిథమ్, డేటా స్ట్రక్చర్స్ వంటి నైపుణ్యాలు పెరుగుతాయి.
విదేశీ భాషల అభ్యాసం
మొదటి సంవత్సరంలో ప్రారంభించిన విదేశీ భాష అభ్యసనాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో సమర్థంగా నిలబడడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.
పేపర్ పబ్లికేషన్లు
రిసెర్చ్ పేపర్ రాయడం, టెక్నికల్ సెమినార్స్, వర్క్‌షాప్స్‌లో పాల్గొనడం మరియు ప్రాజెక్టులను ప్రదర్శించడం ప్రారంభించాలి. దీని ద్వారా విద్యార్థుల పరిశోధన సామర్థ్యాలు మెరుగుపడతాయి. విద్యార్థి దశలోనే ఈ ప్రయత్నాలు చేయడం అత్యంత ముఖ్యమైనది.
ఇది చదవండి: బీటెక్/బీఈ మొదటి సంవత్సరంల ఇంజినీరింగ్ కెరియర్..రోడ్ మ్యాప్ ఇదిగో!