SRH vs RR: సెంచరీతో ఇషాన్ విధ్వంసం... దంచికొట్టిన హెడ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి.! 11 month ago
IPL 18వ సీజన్ ప్రారంభమైన రెండో రోజే SRH మరో రికార్డును నమోదుచేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పరుగుల వరదతో తడిసి ముద్దయింది. సీజన్ మారినా కానీ సన్‌రైజర్స్ జట్టు ఆటేం మారలేదు. సీజన్ ప్రారంభం అని కూడా చూడకుండా కాటేరమ్మ కొడుకులు ఊచకోత కోశారు. IPL చరిత్రలోనే రెండో అతిపెద్ద స్కోరును సీజన్ మొదటి మ్యాచ్ లోనే చేసి సన్‌రైజర్స్ తమ సత్తా చాటారు. అసలు ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ కూడా వీళ్లదే అనుకోండి... అది వేరే విషయం. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ రేంజ్ విధ్వంసం చేసి..ప్లేయర్లు మారిన, ఆట మారలేదు..2024లో ఎలాంటి బ్యాటింగ్ చేసామో..మళ్లీ అలాంటి బ్యాటింగ్ తోనే మొదలుపెడతాం అంటున్నారు SRH ఆటగాళ్లు.
తొలుత టాస్ గెలిచి RR బౌలింగ్ ఎంచుకుంది. అలా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడమే వారి పాలిట శాపంగా మారింది. బరిలోకి దిగిన SRH ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో ఫరూకీకి అభిషేక్ స్వాగతం పలికాడు. రెండో ఓవర్లో తీక్షణకు హెడ్ తన హిట్టింగ్ రుచి చూపించాడు. వేసిన ప్రతి బాల్ ని బౌండరీ బయటకే పంపించారు. హిట్టింగ్ సమయంలో 24 పరుగులకే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోగా.. ఊపిరి పీల్చుకున్నారు RR బౌలర్లు.
అభిషేక్ వెళ్లడంతో ఇషాన్ కిషన్ క్రీజ్ లోకి చేరుకున్నాడు. అభిషేక్ వెళ్లిన హెడ్ ఆగలేదు..అదే ఊచకోత కొనసాగించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటగా.. 31 బాల్స్ కి 67 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
సన్‌రైజర్స్ తరుపున ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. వచ్చిన ప్రతి బౌలర్ ని దంచి కొట్టాడు. దీంతో బౌలర్ల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. మరో ఎండ్ నుంచి నితీశ్ రెడ్డి ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు.
చివరిలో క్లాసెన్ కూడా తన మెరుపు హిట్టింగ్ తో వీరబాదుడు బాదాడు..14 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఇషాన్.. సందీప్ శర్మ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసి సన్‌రైజర్స్ తమ బాటింగ్ బలాన్ని మిగతా జట్టులన్నింటికి చూపించింది. రైజర్స్ బ్యాటర్ల విధ్వంసానికి.. RR బౌలర్లు చిత్తయ్యారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి IPL చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేశాడు. అందరిలో తుషార్ దేశ్‌పాండే కాస్త బెటర్. 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
అయితే 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR ఓపెనర్లు రాణించలేకపోయారు. జైస్వాల్ (1) ఒక పరుగుకే అవుట్ కావడంతో.. ఇక మ్యాచ్ మీద ఆశలు పోయాయి. కెప్టెన్ పరాగ్ (4), నితీష్ రానా (11) కూడా తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. సంజు శాంసన్ (66) ఒక్కడే ఒక ఎండ్‌లో నిలకడగా ఆడాడు. ధ్రువ్ జురెల్ (70) మెరుపు ఇన్నింగ్స్ తో సంజుకు సపోర్ట్ ఇచ్చాడు. షిమ్రాన్ హెట్మయర్ (42), శుభం దూబే (34) భాగస్వామ్యం కూడా రాజస్థాన్ ను కాపాడలేక పోయింది. దీంతో 242 పరుగులకు 6 వికెట్లు నష్టపోయి SRH చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుని సన్‌రైజర్స్ తరుపున మంచి బౌలింగ్ ప్రదర్శన కనపరిచాడు.
ఈ విజయం SRH జట్టుకు 2025 IPL సీజన్లో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లోని పరుగుల వర్షం, ఆటగాళ్ళ అద్భుతమైన ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాయి. సన్‌రైజర్స్ ఈ రేంజ్ బాటింగ్ చూసాక ఏ జట్టయినా బయపడాల్సిందే.