Jagan: ఊడిగం చేసే పోలీసులకు శిక్ష తప్పదు 12 d ago

AP: రాప్తాడులో నియోజకవర్గంలో కురుబ లింగమయ్య హత్యకు గురవ్వడం బాధాకరమన్నారు వైఎస్ జగన్. ఈ కేసులో కేవలం ఇద్దరిపైనే కేసులు పెట్టారని, అసలైన వారిని వదిలేశారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కుమారుడు పాపిరెడ్డిపల్లి గ్రామంలోకి వచ్చి రెచ్చగొట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. లింగమయ్య హత్యపై కంప్లైంట్ పోలీసులే రాసుకొచ్చి భార్యతో బలవంతంగా వేలిముద్ర వేయించారని, ఆయన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును పక్కన పడేశారని తెలిపారు. చంద్రబాబు ఊడిగం చేసే పోలీసులకు శిక్ష తప్పదని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ హత్య కేసులో ఉన్న నిందితులపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన సాగదన్నారు.
ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్ర పరువును సీఎం చంద్రబాబు రోడ్డున పడేశారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అదే విధంగా శాంతిభద్రతలు కూడా క్షీణించాయని పేర్కొన్నారు. ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కూటమి నేతలు కిడ్నాప్‌లు చేస్తున్నారని, ఈ పరిస్థితులు పూర్వపు బీహార్‌ను తలపించేలా ఉన్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో దిగజారిన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా అనేక చోట్ల వైసీపీ గెలిచిందన్నారు. తమ పార్టీ గెలచిన చోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారన్నారు.