YS Jagan: విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ 13 d ago

AP: ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లామని, ఆ ప్రస్థానంలోనే వైసీపీ ఆవిర్భవించిందన్నారు వైఎస్ జగన్. బలమైన పార్టీగా వైసీపీ ఎదిగిందని, విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, విలువలు, విశ్వసనీయత అన్న పదాలే వైసీపీని నడిపించాయని చెప్పారు. వైసీపీ మ్యానిఫెస్టోను పవిత్రమైన గ్రంధంగా భావించామని, కోవిడ్ ఉన్నా అన్ని హామీలు అమలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో పేదల నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాయని, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్లేట్‌ను కూడా లాగేశారని విమర్శించారు.
ఆరోగ్యశ్రీకి రూ. 3500 కోట్ల బకాయిలు పెట్టారని, దీంతో ఆసుపత్రులు వైద్యం చేయలేమని చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన అందడం లేదని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలను నాశనం చేశారన్నారు. రాష్ట్ర అప్పులపై కూటమి నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు వెళ్లిందన్నారు.