Varudu Kalyani: జగన్‌కు వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు 12 d ago

AP: జగన్‌కు వచ్చే ప్రజాదరణ చూసి కూటమి నాయకుల వెన్నులో వణుకు పుడుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. జగన్‌ను తిట్టేందుకు హోం మంత్రి అనితకు సమయం ఉంటుందని, కానీ విశాఖ జిల్లాలో ప్రమోన్మాది చేతిలో ఒక మహిళ మరణిస్తే పరామర్శించడానికి సమయం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకు 70 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని, విశాఖపట్నంలో విచ్చలవిడిగా గంజాయి పెంపకం చేస్తున్నారని చెప్పారు. జగన్‌కు వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతూ, ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌పై మంత్రి అనిత సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదన్నారు.
పోలీసులను కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు గానీ, ప్రజల రక్షణకు గానీ ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. కూటమి నాయకుల్లో 85 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, క్రిమినల్స్ ఎవరో తెలుసుకోని మాట్లాడాలన్నారు. పోలీసులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పోలీసులను తిట్టిన ఘనత టీడీపీదే అని అన్నారు. లేనిపోనివి కల్పించి ప్రజలను మభ్యపెడుతున్నారని, మహిళలను వైసీపీలో అవమానించడం ఎప్పుడైనా చూశారా అని మంత్రి అనితను ప్రశ్నించారు. మహిళలంటే జగన్‌కు ఎంతో గౌరవం అని, వారు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయి కల్పించడానికి ఎంతో కృషి చేశారన్నారు. మహిళా పక్షపాతిగా ఐదేళ్లు జగన్ పాలన చేశారన్నారు. ఏ పోలీసులైతే టీడీపీ ఏజెంట్లుగా పని చేస్తారో వారిని మాత్రమే శిక్షిస్తామని జగన్ చెప్పారన్నారు.