Merugu Nagarjuna: విద్యాశాఖ మంత్రి విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదు 14 d ago

AP: వైసీపీ హయాంలో పేద ప్రజలు ధైర్యంగా పిల్లలను చదివించుకున్నారన్నారు వైసీపీ నేత మేరుగు నాగార్జున. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదని, చదువులు చదివించాలంటే తడిసిమోపెడవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని, బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని, పిల్లలను చదివించలేక అప్పుల పాలవుతున్నారని చెప్పారు. విద్యాశాఖ మంత్రి రాజకీయాలు తప్ప విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదని, వారి సమస్యలపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పేద పిల్లల స్థితిగతులను మార్చడానికి జగన్ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, వైసీపీని విమర్శించే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని, విద్యార్థులను కూలీకి వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై అవగాహన లేదని, విద్యా వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆలోచన లేదని మండిపడ్డారు. హైయర్ ఎడ్యుకేషన్‌ను అతాలకుతలం చేశారని, విశ్వ విద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేవని చెప్పారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.