NEW-GEN SKODA KODIAQ: త్వరలో భారతీయ రోడ్లపై న్యూ-జెన్ స్కోడా కొడియాక్..! 13 d ago

స్కోడా ఆటో ఇండియా తమ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం SUV, స్కోడా కొడియాక్ యొక్క సరికొత్త తరం మోడల్ టీజర్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఈ అధునాతన SUV భారతీయ మార్కెట్లో విడుదల కానుందని కంపెనీ తెలిపింది. ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ సరికొత్త కొడియాక్‌ను ప్రదర్శించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 5 & 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్ మార్కెట్లో మాత్రం కేవలం 7 సీట్ల ఫార్మాట్‌లో మాత్రమే విక్రయించబడుతుందని తెలుస్తోంది. 2025 మధ్య నాటికి భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనున్న ఈ SUV.. తన మునుపటి విజయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకసారి ఈ SUV పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్:
కొత్త స్కోడా కొడియాక్ పాత మోడల్ కంటే 61mm ఎక్కువ పొడవును కలిగి ఉంది.. దీని మొత్తం పొడవు 4,758 mm గా నమోదైంది. స్కోడా యొక్క కొత్త మోడల్ 'మోడ్రన్ సాలిడ్' డిజైన్ ఆలోచనను ప్రతిబింబిస్తూ.. ఈ SUV ముందు భాగంలో క్వాడ్ హెడ్‌ల్యాంప్ లైట్ సెటప్‌తో ఆధునికమైన రూపాన్ని కల్పిస్తుంది. వెనుక భాగంలో స్కోడా అక్షరాలతో కూడిన C-ఆకారపు టెయిల్ లాంప్‌లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టెయిల్ గేట్ కూడా కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది లోడింగ్ మరియు అన్‌లోడింగ్‌ను సులభతరం చేస్తుంది.
అధునాతన ఇంటీరియర్ మరియు సాంకేతికత:
కొత్త స్కోడా కొడియాక్ యొక్క ఇంటీరియర్ పూర్తిగా కొత్తగా రూపొందించబడింది. ఇందులో 13-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్..మరియు డ్రైవర్ కోసం 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (వర్చువల్ కాక్‌పిట్) వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం గేర్ సెలెక్టర్‌ను సెంటర్ కన్సోల్ నుంచి స్టీరింగ్ వీల్ వెనకకు మార్చారు. దీనివల్ల ఇందులో అదనపు స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. 3rd జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు క్యాబిన్‌లోని సౌకర్యాన్ని పెంచుతున్నాయి.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు:
భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కొత్త స్కోడా కొడియాక్ 2.0-లీటర్ EA888 నాలుగు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ 188bhp శక్తిని మరియు 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.. స్మూత్ & క్విక్ గేర్ షిఫ్ట్‌లను అందిస్తుంది.
స్కోడా కోడియాక్ ధర వివరాలు:
ఈ కొత్త స్కోడా కొడియాక్ భారతదేశంలో ₹40 - ₹55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఇది టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ మరియు జీప్ మెరిడియన్ వంటి బలమైన పోటీదారులతో తలపడటానికి సిద్ధంగా ఉంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి ఇతర ప్రీమియం SUV లకు కూడా ఇది గట్టి పోటీనిస్తుంది.
స్కోడా కొడియాక్ టీజర్ విడుదలతో.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ కొత్త స్కోడా కొడియాక్ విడుదలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆధునిక డిజైన్.. అధునాతన ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజిన్‌తో ఈ SUV ప్రీమియం SUV సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీని అధికారిక లాంచ్.. అలాగే ధర వివరాల కోసం వేచి చూడాల్సిందే.
ఇది చదవండి: 6.88 HD+ LCD డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి బ్లాక్‌బస్టర్ ఫీచర్లతో పోకో C71.. కేవలం ₹6,499కే.!