Koramutla Srinivasulu: నష్టపోయిన కుటుంబాలకు అండగా జగన్ 12 d ago

AP: హింసాత్మకమైన ఘటనలపై ఇంటిలిజెన్స్ అధికారులు, పోలీసులు ముందే పసిగడతారని, అయినా కూడా పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య జరిగిందన్నారు వైసీపీ నేత కొరముట్ల శ్రీనివాసులు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కలుస్తారని, ఎందుకంటే ఆయన ఒక భరోసా, నమ్మకం అని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలన్నదే జగన్ ఉద్దేశమని, అక్కడ జరిగిన సంఘటనపై పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాడానికి వెళితే హేళన చేస్తున్నారని తెలిపారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించడానికి వెళితే కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? నియంత పాలనలో ఉన్నామా ? అని ఆలోచన చేయాలన్నారు.
కొంత మంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారని, అదే విధంగా కొందరు పోలీసులు కూటమి నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి ప్రభుత్వానికి బలం లేదని, అయినా వైసీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి, దౌర్జన్యాలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకున్నారని చెప్పారు. కూటమి మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, హోం మంత్రి అనితపై ప్రజలకు నమ్మకం లేదని తెలిపారు. అన్యాయమైన కుటుంబాలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ గురించి చంద్రబాబు, లోకేష్ దారుణంగా మాట్లాడారని, కానీ పోలీసులను జగన్ గౌరవిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక దారుణాలు జరిగాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని పేర్కొన్నారు.