Gautam Gambhir: ఇక నేను చెప్పినట్లే ఆడాలి..! 5 d ago
న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో టీమ్ ఇండియా విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో జట్టును గాడిన పెట్టేందుకు కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని అతడు స్పష్టం చేశాడని తెలుస్తోంది. అయితే అతడి కోచింగ్ శైలిపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, వరుస పరాభవాలతో ఓవైపు భారత ఆటగాళ్లు, మరోవైపు కోచ్ గంభీర్ కూడా విమర్శలకు గురవుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఒకరకమైన ఒత్తిడి వాతావరణం నెలకొంది. మెల్బోర్న్ టెస్టులో 20.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి పరాజయం పాలైన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. "ఇప్పటి వరకు జరిగింది చాలు" అని గంభీర్ అన్నాడట. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ఆటగాళ్ల తప్పులను ఎత్తి చూపడానికి అతడు ఏమాత్రం వెనుకాడలేదు! ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించనప్పటికీ కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా, సహజమైన ఆట పేరుతో సొంత ఆట ఆడుతున్నారని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. గత ఆరు నెలలుగా జట్టును అది కోరుకున్నట్లు ఆడనిచ్చానని, ఇకపై ఎలా ఆడాలన్నది తాను నిర్ణయిస్తానని తేల్చి చెప్పడమే కాదు.. తాను ముందే నిర్ణయించిన జట్టు ప్రణాళిక ప్రకారం ఆడని ఆటగాళ్లను జట్టు నుంచి పంపించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముందు చర్చించిన వ్యూహం ప్రకారం కాకుండా, సొంతంగా ఆడుతున్నారని ఆటగాళ్లతో అతడు చెప్పాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్ తో సిరీస్ నుంచి బ్యాటర్లు ఎంత పేలవంగా ఆడుతున్నది అతడు వివరించాడట. నాలుగో టెస్టు ఆఖరి రోజు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి కోహ్లి, పార్ట్ టైమ్ స్పిన్నర్ హెడ్ బౌలింగ్లో అనవసర షాట్తో పంత్ ఔట్ కావడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్ నూ అనవసర షాట్కే ఔటయ్యాడు. అతడు మూర్ఖంగా షాట్ ఆడాడంటూ దిగ్గజ క్రికెటర్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.