Rastriya Military School:రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో అడ్మిషన్స్ ప్రక్రియ 1 y ago
రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో బాలబాలికలకు విద్యా బోధన ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా మిలిటరీ స్కూళ్లు 5 మాత్రమే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్, రాజస్థాన్‌లోని అజ్మీర్, ధోల్‌పూర్, కర్ణాటకలోని బెల్గాం, బెంగుళూరులో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 70 శాతం సీట్లు రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, మిగిలిన 30 శాతం సీట్లు ఇతర వర్గాల పిల్లలు చదువుకోవచ్చు. ఈ స్కూల్స్ ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్.
నోటిఫికేషన్ జారీ
దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సారానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ స్కూళ్లలో అడ్మిషన్ పొందాలంటే ఆర్మీ నిర్వహించే టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
విద్యార్ధి 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు, అర్హతా ప్రమాణాలు ఇలా...
ఆరవ తరగతిలో ప్రవేశం పొందాలంటే విద్యార్ధి వయస్సు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య, 9వ తరగతిలో ప్రవేశం కావాలంటే 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 6వ తరగతి ప్రవేశానికి విద్యార్ధి ఏప్రిల్ 1, 2013 నుంచి మార్చి 31, 2025 మధ్యన, 9వ తరగతి ప్రవేశానికయితే ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. ప్రవేశ పరీక్షను ఓఎమ్మార్ అధారిత మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్షా విధానం ఇలా...
6వ తరగతిలో ప్రవేశ పరీక్ష రాసే విద్యార్ధులకి 5వ తరగతి స్ధాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో 50 మార్కులు, ఇంటెలిజెన్స్ లో 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ లో 50 మార్కులు, మ్యాథ్స్ లో 50 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్య్యూకు 20 మార్కులు ఉంటాయి. తొమ్మిదవ తరగతిలో ప్రవేశ పరీక్ష రాసే విద్యార్ధులకి 5వ తరగతి స్ధాయిలో హిందీ సబ్జెక్టులో 20 మార్కులు, ఇంగ్లీష్‌లో 50 మార్కులు, సోషల్‌లో 30 మార్కులు, మ్యాథ్స్‌లో 50 మార్కులు, సైన్స్‌లో 50 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్య్యూకు 50 మార్కులు ఉంటాయి. అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్ధినీ, విద్యార్ధులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్ధులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ తదితర వివరాలను ఎస్ఎంఎఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.