Engineering or Degree: ఇంటర్ తర్వాత ఇంజినీరింగా? లేక డిగ్రీ కోర్సులా? 11 d ago

విద్యార్ధి దశలో ఇంటర్మీడియట్ తర్వాత తీసుకునే నిర్ణయం ఎంతో కీలకమైనది. ఈ క్రమంలో ఇంటర్ తర్వాత తీసుకునే కోర్సుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్ధులకు ఇంటర్‌లో తీసుకున్న గ్రూపులకు అనుగుణంగా అందుబాటులో ఉండే కోర్సులేంటో తెలసుకుందాం.
ఇంటర్ ఎంపీసీ (MPC):
చాలా మంది విద్యార్ధులు 10వ తరగతి విద్యను పూర్తి చేసాక ఇంజనీరింగ్ చదవాలని ఇంటర్మీడియట్ ఎంపీసీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో చేరతారు. ఇంటర్‌ను దిగ్విజయంగా పూర్తిచేసిన వారు ఐఐటీ, నిట్‌లు, బిట్స్ పిలానీ క్యాంపస్‌లు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో సీటు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఐఐటీలు, నిట్‌ల్లో చేరాలనుకుంటే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. రాష్ట్రంలో అయితే ఎంపీసీ విద్యార్ధులు ఎక్కువగా రాసే పరీక్ష ఎంసెట్.
ఈ క్రమంలో వారు అనుకున్న కళాశాలలో సీటు రాకపోవడం చేతనో లేదా ఆర్ధిక సమస్యల వల్ల కానీ ఇంజనీరింగ్ అంటే ఆసక్తి లేని వారు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) వంటి కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
ఇంటర్ బైపీసీ (BiPC):
ఇంటర్ బైపీసీ(బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తి చేసిన వారు జాతీయ స్ధాయిలో నిర్వహించే నీట్ పరీక్ష ఎంట్రన్స్ పరీక్ష రాసి మెడికల్ కోర్సులో చేరొచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, మెడికల్ సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దాంతో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకునే వారికి తీవ్రపోటీ ఎదురవుతోంది. ఇంటర్ బైపీసీ విద్యార్ధులు నర్సింగ్ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ) అర్హతతో డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ) కోర్సులో చేరొచ్చు.
పారామెడికల్ కోర్సులు:
ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత తక్కువ కాల వ్యవధిలో ఉద్యోగావకాశాలు అందించే కోర్సులు. పారా మెడికల్ కోర్సులు. రోగికి డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్, థెరపీ సరిగా జరిగేలా డాక్టర్‌కు సహకరించే వారే పారామెడికల్ నిపుణులు. ఆరోగ్యరంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆరోగ్య రంగంలో అవకాశాలు అపారం.
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డార్క్ రూమ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, ఎంపీహెచ్‌పీపీ, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సులు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. బైపీసీ విద్యార్ధులకు ఇటీవల కాలంలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్ వంటి విభాగాలు విస్తరిస్తుండటంతో ఆయా సబ్జెక్టులతో కోర్సులను అందిస్తున్నాయి.
ఇంటర్ ఎమ్ఈసీ (MEC):
సైన్స్ సబ్జెక్ట్ పైన ఆసక్తి లేని వారు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి కలిగిన వారు ఈ గ్రూపును ఎంచుకుంటారు. ఈ గ్రూప్ కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్ ఎమ్ఈసీ(మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్) తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీలో కామర్స్ కాంబినేషన్‌తో గ్రూపు లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో మ్యాథ్స్ కాంబినేషన్‌తో గ్రూపు లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవచ్చు.
ఇంటర్ సీఈసీ (CEC):
ప్రస్తుతం వ్యాపార రంగం ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తుండటంతో కామర్స్ విద్యార్ధులకు అవకాశాలు పెరిగాయి. ఇంటర్‌లో సీఈసీ(సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్) పూర్తి చేసిన విద్యార్ధులు డిగ్రీ స్ధాయిలో బీకాం కోర్సులో చేరొచ్చు. దీంతో పాటు ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్ వంటి కోర్సులను పూర్తిచేయొచ్చు. బీకాం పూర్తయ్యాక రెగ్యులర్‌గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ), ఎంకాం (మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు.
ఇంటర్ హెచ్ఈసీ (HEC):
సాధారణంగా ఇంటర్మీడియట్ హెచ్ఈసీ(హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్) తీసుకున్న విద్యార్ధులు డిగ్రీస్ధాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, లా, సోషల్ వర్క్, జర్నలిజం, బిజినెస్ మేనేజ్‌మెంట్, టూరిజం, యానిమేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులు చేయొచ్చు.
హెచ్ఈసీ విద్యార్ధులు ఉద్యోగ నియామక పరీక్షల్లో ముందుండే అవకాశముంది. ఎందుకంటే ఆయా పోటీ పరీక్షలలో ఎక్కువగా ఉండే సిలబస్ అంశాలు హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టుల నుంచే ఉంటున్నాయి. దీంతో అకడమిక్ స్ధాయిలోనే బ్యాచిలర్ డిగ్రీలో ఈ అంశాలను పూర్తి స్ధాయిలో నేర్చుకున్న విద్యార్ధులు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో రాణించే వీలుంటుంది.
విద్యార్ధులు తమను తాము విశ్లేషించుకొని సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. విద్యార్ధి తీసుకున్న కోర్సు ఏదైనప్పటికీ, ఏకోర్సు కుండే ప్రత్యేకత ఆ కోర్సుకుంటుంది. అలాగే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఆసక్తి, నైపుణ్యాలు, బలాలు, బలహీనతలు పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తును నిర్ణయించుకోవాలి.
ఇది చదవండి: ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాల గైడెన్స్.!