Revanth Reddy: నగరంలో మెట్రో, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సమీక్ష..! 1 d ago
TG :మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన షామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. "రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్-షామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యారడైజ్-మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మేడ్చల్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ నిర్మించాలి. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ ఘటన పై తన నివాసంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రాధాన్య కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.