ట్రంప్ సమాధానం.. ! 21 h ago
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా .. ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లోనూ టెస్లా అధినేత ప్రభావం ఎక్కువగా ఉంటుంది . దీనితో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొదటిసారి ఆరిజోనాలో ఏర్పాటుచేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 'ప్రెసిడెంట్ మస్క్' అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. "ఆయన (మస్క్) అధ్యక్షుడు కాలేరని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన ఈ దేశంలో జన్మించలేదు" అని ట్రంప్ పేర్కొన్నారు.టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత అయిన మస్క్.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి ఎవరైనా సరే అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కాగా.. ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో కాబోయే అధ్యక్షుడు మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన టెస్లా అధినేత.. 'అద్భుతం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ సారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ దగ్గరుండి ట్రంప్ కు సంపూర్ణ మద్దతు అందించిన విషయం తెలిసిందే. స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్, తన పాలకవర్గంలోకి మస్క్ ను తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)కి సారథిగా నియమించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పలు ప్రపంచ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడిన సమయంలోనూ టెస్లా అధినేతను తన పక్కనే ఉంచుకున్నారు.
దీంతో కాబోయే అధ్యక్షుడి పాలనలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం ప్రారంభమైంది. దీనికి తగ్గట్లుగానే ఇటీవల మస్క్ వ్యతిరేకించిన ఓ బిల్లును ట్రంప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వషట్ డౌన్ ను తప్పించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కారు తీసుకొచ్చిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించొద్దని మస్క్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ట్రంప్ ఈ బిల్లుపై చర్చ జరపాలని తన రిపబ్లికన్ నేతలకు సూచించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాబోయే అధ్యక్షుడు తన పదవిని టెస్లా అధినేతకు అప్పగిస్తారేమోనంటూ డెమోక్రాట్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.