AICTE 2025: కృత్రిమ మేథ సంవత్సరంగా 2025- ఏఐసీటీఈ 9 d ago
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) 2025ను కృత్రిమ మేథ సంవత్సరంగా ప్రకటించింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేథ (ఏఐ) మీదనే ఆధారపడి నడుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారతదేశాన్ని కృత్రిమ మేధ రంగంలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. అందుకు ప్రాథమికంగా పలు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. అంతేకాకుండా ఈ నెలాఖరులోపు (2024 డిసెంబర్,31) కృత్రిమ మేథ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని దాదాపు 14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ కి, డైరెక్టర్లకు ఏఐసీటీఈ లేఖ రాసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా కళాశాలలు సమర్పించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటుంది. కృత్రిమ మేథలో ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలలకు పురస్కారాలు ప్రకటిస్తుంది. అందరికీ ఏఐ పేరిట విద్యాసంస్థల ప్రాంగణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రకాల కార్యక్రమాలను ఏఐసీటీఈ సూచించింది.
అవగాహన వారోత్సవాలు: కార్యశాలలు (వర్క్ షాప్ లు), నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్లు నిర్వహణ.
స్టూడెంట్ ఛాప్టర్స్ ఏర్పాటు: విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి నేర్చుకోవడం, ఏఐలో ఆవిష్కరణలు చేయడం.
ల్యాబ్ లు: కళాశాలల్లో ఏఐ ల్యాబ్‌లు నెలకొల్పడం.
కెరీర్ మార్గం: విద్యార్థులకు ఏఐ రంగంలో అవకాశాలతో పాటు తదితర వాటిపై కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించడం.
అధ్యాపకులకు శిక్షణ: అన్ని బ్రాంచీల్లో కృత్రిమ మేథ పాఠ్యాంశాలను చేరుస్తారు. ప్రాథమిక అంశాలతోపాటు అడ్వాన్స్‌డ్ ఏఐ పాఠ్యాంశాలను చేర్చి సిలబస్‌ను ఉన్నతీకరించాలని ఏఐసీటీ ఈ నిర్ణయించింది. అధ్యాపకులను కూడా కృత్రిమ మేథ బోధనలో నిపుణులుగా మార్చేందుకు కార్యశాల(వర్క్ షాప్) ను నిర్వహిస్తుంది. దీనిపై పనిచేసే సంస్థల్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో విద్యార్థులు క్షుణ్నంగా తెలుసుకునేందుకు పరిశ్రమలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. అందుకు వాటిల్లో ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు చేయొచ్చు.