KTR: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ రేవంత్ రెడ్డి 6 d ago
అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికలో తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరి చేసుకుంటే ఇబ్బందేమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్ర్ కుమార్ రెడ్డికి నోటీసులిస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇంచార్జిలను పిలుస్తున్నారు.. కానీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పిలవడం లేదని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ను కోరామన్నారు. 'మా భూమి మేము ఇవ్వం' అన్న పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని వ్యాఖ్యానించారు. భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా? జైల్లో రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. రైతుల బాధలు సమస్యలు కావా? అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ అవసరమా? సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు..ఒక్క పైసా తేలేదని ఏదేవ చేసారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు..అరాచక ప్రభుత్వం అని అన్నారు.
రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? కొడంగల్ ప్రజల తరపున బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారు. రైతుల తరఫున మేం పోరాటం చేస్తామని కేటీఆర్ తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా రైతుల తరపున అన్ని రూపాల్లో కొట్లాడుతామని చెప్పారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి దోస్తు అదానీ గురించి మాట్లాడదామంటే మమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వరు.. రైతుల గురించి మాట్లాడదామంటే అసెంబ్లీ నుండి పారిపోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.