Amaravati: ఆలయం నమూనాలో నిర్మిస్తామని బిట్స్..! 9 d ago
రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయం నమూనాలో నిర్మిస్తామని బిట్స్ ప్రతిపాదించింది. ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్‌కి స్థలం ఇవ్వాలని సీఆర్‌డీఏ భావించింది. అక్కడైతే 50-100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ తమకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో... అక్కడైతే 35 ఎకరాలే ఇవ్వగలమని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఎక్స్ఎల్ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థకు ఐనవోలు వద్ద 2014-19లోనే సీఆర్‌డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడూ అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల స్థాపనకూ రంగం సిద్ధమవుతోంది.
2014-19 మధ్యలో రాజధానిలో దాదాపు 135 సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. వాటిలో పలు కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. అప్పట్లో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలన్న ఒప్పందం మేరకు స్థలాలు కేటాయించారు. గడువు ముగియడంతో ఆ కేటాయింపులన్నీ ఇప్పుడు సాంకేతికంగా రద్దయ్యాయి. వాటిని పునరుద్ధరించే క్రమంలో కొన్ని మార్పులు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలనూ వీలైనంత వరకు ఒకే భవనంలోకి తీసుకొచ్చేలా, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా భవనం నిర్మించేలా ప్రతిపాదిస్తోంది. బ్యాంకులకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాల్ని రద్దు చేసి... వాటి కార్యాలయాలనూ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియం, ల్యాబ్‌లకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించనున్నారు.