ISRO: అంతరిక్షంలో మొక్కలను పెంచేందుకు ఇస్రో ప్రయత్నం..! 14 d ago
అంతరిక్షంలో మొక్కలను పెంచేందుకు ఇస్రో ప్రయత్నం చేస్తుంది. క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి (మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం 8 అలసంద విత్తనాల్ని(COWPEA SEEDS) అంతరిక్షంలోకి పంపించి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది.
అంతరిక్షంలో విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించిన క్రాప్స్ అనే వ్యవస్థను కూడా ఇందులో నింగిలోకి పంపించనున్నారు. దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలు, స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం 24 ప్రయోగాలను 'పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పర్మెంట్ మాడ్యూల్' (POEM) SPA- DEX(స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్ ) ద్వారా చేపట్టబోతున్నారు. దీనికోసం డిసెంబర్ 30న 'పీఎస్ఎల్వీ-సీ60' మిషన్ ద్వారా భూ కక్ష్యలోకి చేజర్, టార్గెట్ అనే రెండు శాటిలైట్లను ఇస్రో ప్రవేశ పెట్టబోతుంది.
మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన 'స్పేస్ డాకింగ్ టెక్నాలజీ'ని పరీక్షించనున్నారు. విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ 'కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)' అనే పేలోడ్ వ్యవస్థను రూపొందించింది. అమిటీ విశ్వవిద్యాలయం (ముంబై) అభివృద్ధి చేసిన అమిటీ ప్లాంట్ ఎక్స్పరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్(ఏపీఈఎంఎస్) ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షిస్తారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి శాస్త్రవేత్తలు తీసుకురానున్నారు.
ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ) రూపొందించిన డెబ్రీ క్యాప్సర్ రోబోటిక్ మ్యానిప్యులేటర్ కక్ష్యలో శకలాలను ఒడిసిపడుతుంది. ముంబయికి చెందిన మనస్తు స్పేస్ స్టార్టప్ వ్యోమ్-2యూ (VYOM-2U) అనే హరిత చోదక థ్రస్టర్ (GREEN PRO- PULSION THRUSTER)ను పంపుతోంది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, కొన్ని పదార్థాలతో కూడిన మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వ్యోమనౌకల్లో వాడుతున్న హైడ్రోజన్‌కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థ ఇంధనాన్ని అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం.