DR. Manmohan Singh: మన్మోహన్ సింగ్..ఒక ఆర్థిక వైద్యుడు..! 10 d ago
సుమారు 30 ఏళ్ల క్రితం, భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రకెక్కారు. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో దేశం ద్రవ్య, కరెంటు ఖాతా లోటు వంటి సమస్యలతో సతమతమైంది. అలాగే ద్రవ్యోల్బణం కూడా తారా స్థాయికి చేరింది.
పి.వి. నరసింహారావు ప్రధాని అయ్యాక ఆయన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్‌ను నియమించారు. ఎవరికి రాజకీయ నేపథ్యం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం ఆర్థిక చర్యలు చేపట్టమని కోరారు. జులై 24, 1991లో మన్మోహన్ సింగ్ తన మొదటి బడ్జెట్‌లో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఎన్నో కీలక మార్పులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆయన లైసెన్స్ రాజ్ విధానాన్ని తొలగించి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలు కల్పించారు.
1980లో దేశంలోని ద్రవ్యోల్బణం ఏకంగా 17 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ 15వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయన బ్యాంకు రేట్లను పెంచడం, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. దీంతో పెరిగిన ధరలను కిందకు తీసుకురాగలిగారు.
మన్మోహన్ సింగ్ తన ఆర్థిక విధానాల ద్వారా రూపాయి విలువలను రెండు దశల్లో కుదించడం ద్వారా.. భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా..1991 జులై 1న ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువను 9 శాతం, తర్వాత మరో 11 శాతం మేర తగ్గించారు.
ఈ మార్పులతో పాటు ఆర్థిక విధానాలను, గ్రామీణ బ్యాంకింగ్ సౌకర్యాలను కూడా మన్మోహన్ సింగ్ మెరుగుపరిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత దృఢంగా నిలుపుకోవడంలో ఆయన చెప్పిన అంశాలు కీలకంగా మారాయి. విదేశీ మారకాన్ని మెరుగ్గా నిర్వహించేందుకు సంస్కరణలు తెచ్చారు. గ్రామాల్లో కుటుంబాలు, రైతులకు రుణాల లభ్యత పెంచేందుకు పలు సేవలను మొదలు పెట్టారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్ఆర్‌బీ)లు తెచ్చారు.