Chandrababu: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను 3 d ago
AP: విజయవాడ పడమటలోని దత్త పీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామితో చంద్రబాబు సమావేశం అయ్యారు. చంద్రబాబుకు సచ్చిదానందస్వామి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాలలో చేపట్టబోయే దత్త క్షేత్ర నదీ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నా, సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారని చెప్పారు. నా కష్టాలు తొలగాలని పూజలు చేసి నాకు ప్రసాదం అందించారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలామంది తప్పుపట్టారని, కానీ ఆ విజన్ ఫలితాలు ఇవాళ అందరికీ కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నామని, సంపద రావాలి ప్రజలు సంతోషంగా ఉండాలని చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ముందుకెళ్లటమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావన మనలో ఉండాలని, ఎప్పుడో యదార్థతని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలని... భగవంతుడి ఆశీస్సులు కూడా తోడుగా ఉండాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి.. ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. ఆ దిశగా కృషి చేస్తానని, ప్రజలు నాపై నమ్మకం పెట్టుకోవాలి.. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు.