Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్..! 11 d ago
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎంతో చర్చించిన విషయాల గురించి ఆయన తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశం చేశారని అన్నారు. ఈ కాలంలో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను సీఎం రేవంత్ మాతో పంచుకున్నారని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారని తెలిపారు. అందుకు అనుగుణంగా మేమంతా కలిసి వర్క్ చేస్తాం... ఇండియన్ సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారన్నారు. దానిపై చిత్రపరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్‌డీసీ ద్వారా ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తామన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోందన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నేను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయిందని చెప్పారు. యూఎస్ వెళ్లి రాగానే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం అని వెల్లడించారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న విషయం.. అది ముఖ్యం కాదు.. ఇంటర్నేషనల్‌గా తెలుగు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు పేర్కొన్నారు.