YSRCP: రోడ్ల‌పైకి వ‌చ్చిన కీల‌క నేత‌లు.. అదే జ‌గ‌న్ టార్గెట్‌ 10 d ago

featured-image

వైఎస్సార్ సీపీ మ‌ళ్లీ యాక్టివ్ అయ్యింది. 2024 ఎన్నిక‌ల ఓట‌మి త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన నేత‌లు ఒక్కొక్క‌రిగా పార్టీ కార్య‌క్ర‌మాల‌తో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో వ‌రుస అరెస్టులు, అవినీతి ఆరోప‌ణ‌లతో స్తుబ్ధుగా ఉన్న కీల‌క నేత‌లు, వైసీపీ అధిష్టానం ఆదేశాల‌తో విద్యుత్ చార్జీల‌ పెంపుపై జ‌రుగుతున్న పోరుబాట‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యుత్ చార్జీల‌ను పెంచ‌డంతో వైఎస్సార్ సీపీ శుక్ర‌వారం ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. నియోజ‌క‌వ‌ర్గాల కేంద్రంగా ర్యాలీ నిర్వ‌హించి, విద్యుత్ కార్యాల‌యాల‌కు చేరుకుని విన‌తి ప‌త్రాలు ఇచ్చే విధంగా కార్య‌క్ర‌మ రూప‌క‌ల్ప‌న చేశారు. 


అధిష్టానం సూచ‌న‌ల‌తో అన్నిజిల్లాల్లో పోరుబాట కార్య‌క్ర‌మం ఉత్సాహంగా జ‌రుగుతోంది. డిసెంబ‌రు 13న రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌లెక్ట‌రేట్ ల వ‌ద్ద వైసీపీ చేప‌ట్టిన ఆందోళ‌న విజ‌య‌వంత‌మైనా.. అల్లు అరెస్ట్ అదే రోజు జ‌ర‌గ‌డంతో.. మీడియా ఫోక‌స్ అంతా దాని మీద‌కు మ‌ళ్లింది. ఇప్పుడు విద్యుత్ పై జ‌రుగుతున్న పోరుబాట‌లో జిల్లాల వారీగా కీల‌క నేత‌లు పాల్గొంటున్నారు. అస‌లు పార్టీలో ఉన్నారా.. లేరా.. ఇత‌ర పార్టీల్లోకి జంపు అవుతారా... అన్న అనుమానాలు మోస్తున్న నేత‌లు కూడా ర్యాలీల్లో త‌ళుక్కుమ‌న్నారు. 



శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కీల‌క నేత, మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ దాస్ ర్యాలీ నిర్వ‌హించారు. ఇటీవ‌ల ఆయ‌న మాజీ పీఏ గొండు ముర‌ళీ పై ఏసీబీ దాడులు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా క‌నిపించ‌లేదు. అలాగే ప్ర‌కాశం జిల్లా కీల‌క నేత అన్నా రాంబాబు సైతం పోరుబాట కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ త‌ర్వాత రాష్ట్రంలో అత్యంత భారీ మెజార్టీతో దాదాపు 80 వేల‌కు పైగా ఓట్లతో ఆయ‌న గెలుపొందారు. స‌ర్వేల పేరుతో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆయ‌న‌ను పోటీ నుంచి ప‌క్క‌న పెట్టారు. రెడ్డి ఈక్వేష‌న్లో భాగంగా కుందూరు నాగార్జున రెడ్డి కి సీటు కేటాయించారు. అప్ప‌టి నుంచి అన్న రాంబాబు పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 


ఇక జిల్లాల వారీగా చిత్తూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పోరుబాట‌ను ముందుండి న‌డిపించారు. విజ‌య‌వాడ‌లో సెంట్ర‌ల్‌ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లం ప‌ల్లి శ్రీనివాస్‌, విశాఖ ప‌ట్ట‌ణంలో గుడివాడ అమ‌ర్నాథ్‌, అస‌లు వైసీపీలో ఉన్నారా.. లేరా.. అన్న‌ట్లుగా ఉన్న విశాఖ ప‌ట్ట‌ణం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో విద్యుత్ కేంద్రాల ఎదుట ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. 



2027 క‌ల్లా పార్టీకి పున‌రుజ్జీవం


జ‌మిలి ఎన్నిక‌ల నేప‌థ్యంలో 2027 క‌ల్లా వైసీపీకి పున‌రుజ్జీవం తీసుకురావాల‌ని అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అందులో భాగంగానే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌లు చేప‌ట్టే విధంగా పార్టీ శ్రేణుల‌కు పిలుపునిస్తున్నారు. మొన్న రైతుల స‌మ‌స్య‌ల‌పై, నేడు విద్యుత్ చార్జీల‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టేలా ఆదేశాలిచ్చారు. అలాగే 2025 సంక్రాంతి త‌ర్వాత నేరుగా జ‌గ‌నే ప్ర‌జ‌ల‌ మ‌ధ్య‌కు వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని రెండు రోజులు స్థానికుల‌తో భేటీ అయ్యి స‌మ‌స్య‌లు తెలుసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో అసంతృప్తిలో ఉన్న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను మ‌ళ్లీ యాక్టివ్ చేయాల‌న్న‌దే ఆయ‌న ఉద్దేశం. అలాగే స్థానికంగా పార్టీ ప‌రిస్థితి, ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను జ‌గ‌న్ తెలుసుకునే ఆలోచ‌న చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా ఇంత హ‌రీబ‌రీగా జ‌గ‌న్ జ‌నాల్లోకి వెళ్లానుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జ‌మిలి ఎన్నిక‌లే. ఏక కాల ఎన్నిక‌ల‌పై వైసీపీ అధినేత గ‌ట్టిగానే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఓట‌మి నిస్తేజం కొన‌సాగితే.. జ‌మిలి ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ ఓట‌మి త‌ప్ప‌ద‌నే విష‌యం జ‌గ‌న్‌కు బోధ‌ప‌డింది. ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌తో ప్ర‌జ‌ల్లోకెళ్లాల‌నే ఆలోచ‌న‌.. జ‌గ‌న్‌కు ఎంత వ‌ర‌కు మేలు చేస్తుందో.. చూడాలి మ‌రి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD