మిల్లర్లు, రైతు సంఘాలతో మంత్రి నాదెండ్ల భేటీ 2 m ago

featured-image

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై రైతులు సమీపంలోని తమకు ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటు కల్పించాలని ధాన్యం సేకరణపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన ఈ ర్యాండమైజేషన్ విధానం వల్ల రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చింది. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లుకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూరప్రాంతాల్లో ఉన్న వైసీపీ నేతలకు చెందిన మిల్లులకు రవాణా చేసేవారు. కొన్ని సందర్భాల్లో జిల్లాలను దాటించి వంద కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న మిల్లులకు తరలించాల్సి వచ్చేది. దానికయ్యే లేబర్, రవాణా ఖర్చులను కూడా తమ నెత్తినే రుద్దడం వల్ల రైతులు నలిగిపోయారు. కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అయితే, ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందుల్లేకుండా నిబంధనలను సరళతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో ధాన్యం సేకరణ పై సమీక్ష నిర్వహించారు. సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రద్దు చేసి, రైతులు సమీపంలోని తమకు ఇష్టమైన మిల్లులకి ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రవాణా వాహనాలు, గోనె సంచులను సమకూర్చడంతోపాటు ధాన్యం ఎగుమతి, దిగుమతులకు అయ్యే లేబర్ చార్జీలను కూడా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించేలా ప్రోత్సాహించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా రైతుల బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, ఆ ధాన్యాన్ని ఏ మిల్లులకు రవాణా చేస్తే ఆ వాహనాలను జీపీఎస్ పరికరాల ద్వారా ట్రాక్ చేయాలని సూచించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ ఆలస్యం కాకుండా తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమీక్ష అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో రైసు మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణకు సంబందించి ప్రభుత్వం అమలు చేయనున్న విధివిధానాలపై వారికి అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. భారత ఆహార సంస్థ అభ్యర్ధన మేరకు 2 లక్షల బాయిల్డ్ రైస్ (ఉడికించిన బియ్యం)ను కాకినాడ, కోన సీమ తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల రైసుమిల్లర్ల‌కు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. సివిల్ సప్లయిస్ కమిషనర్ జి. వీరపాండియన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ అమూన్ తోపాటు రైతు సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD