సురేఖమ్మ ... ఇదేమిటమ్మా ... ? 1 m ago
తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధవారం సినీ పరిశ్రమను ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలు సినీ వినీలాకాశంలో త్సునామీ సృష్టించాయి. అటు రాజకీయ రంగంలోనూ పెను విమర్శలకు దారితీశాయి. ఇలా మాట్లాడి సినీ పరిశ్రమలోని వ్యక్తులను బజారుకీడ్చేలా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ ఆమెకు హెచ్చరికలు వస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆమె మనసు మారిందని చెప్పినా...అది అరణ్య రోదనగానే మారింది. ముందు అనడం...ఆనక ఉపసంహరించుకున్నా అంటూ చిన్న పదంతో దానికి ఫుల్స్టాప్ పెట్టాలని చూడటం పరిపాటిగా మారింది. అదీ ఒక మహిళగా, బాధ్యతాయుతమైన మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి తన మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని గ్రహించిన ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఉప సంహరించుకుంటున్నా అన్నా...సినీ పరిశ్రమలోని పెద్దలకు మాత్రం అది రుచించడం లేదు. ప్రతి వ్యక్తి తన పాపులారీటీ కోసం సినీ పరిశ్రమను వాడుకోవడం ఏమిటంటూ ప్రముఖ నటుడు చిరంజీవి ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సినీ నటి సమంతా, అక్కినేని నాగార్జునలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మూలంగానే విడాకులు తీసుకున్నారని, ఇలానే అనేక మంది మహిళలు సినీ జీవితంలో అవకాశాలు కేటీఆర్ వల్లే కోల్పోయారని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలతోపాటు సమంతా కూడా సురేఖమ్మ వ్యాఖ్యలను ఖండించారు. ఈక్రమంలోనే సినీ పెద్దలు ఒక్కొక్కరుగా ఆమె వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేఖమ్మ ఒంటరైపోయారు. ఆమె పార్టీకి చెందిన నేతలు, మంత్రులు కూడా ఆమెకు మద్దతుగా ఒక్కటంటే ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. మద్దతుగా నిలవలేదు. ఇది ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. నలుదిక్కులు ఆమెకు మూసుకుపోవడంతో ఆమె దిగివచ్చి తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఆవేదనలో అన్నానని చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై సినీ పెద్దలు ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం.
సినీ కుటుంబాలను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు-చిరంజీవి
సమంత పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు చాలా బాధపడ్డానని చిరంజీవి అన్నారు. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు.. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి" అని చిరంజీవి పేర్కొన్నారు.
కోపం తెప్పిస్తోంది - మంచు లక్ష్మి
* "ఇది చాలా నిరుత్సాహకరం. ప్రతిసారీ రాజకీయ నాయకులు సినీ పరిశ్రమకు చెందినవారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి. అంతేగానీ, ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం.
స్త్రీ ద్వేష వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి - హీరో సుధీర్ బాబు
* "మంత్రి కొండా సురేఖ గారు.. మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తోంది. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు.. బెదిరింపులకు గురికాదు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరవపర్చారు. ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరల్చండి. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చవద్దు.
గౌరవంగా వ్యవహరించాలి - నిర్మాత ఎస్కేఎన్
* "ఓ ప్రజాప్రతినిధి, మంత్రి అయిన కొండా సురేఖ గారు.. ఇలా వ్యక్తిగత జీవితాలను రాజకీయ వివాదంలోకి లాగడం గీత దాటడమే. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు.. ఇతరులపై గౌరవంగా వ్యవహరించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిరాధార, నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తే తేలిగ్గా తీసుకోం. ఇలాంటి ఆరోపణలను మేం ఎన్నటికీ సహించబోం"
అత్యంత దారుణంగా అవమానించారు- దర్శకుడు రాం
* "నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏ మాత్రం సహించకూడదు"
ఓ కేబినెట్ మంత్రి నోటి నుండి ఇలాంటి మాటలు వినాల్సి రావడం చాలా బాధాకరం. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ? - నిర్మాత స్వప్నదత్
చూస్తూ ఊరుకునేది లేదు - ఎన్టీఆర్
"కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు"
అసహ్యం వేస్తోంది - నాని
"రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి"
ఆమె సినీ పరిశ్రమకు ఓ వరం - 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
"రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశా. 365 డేస్ ప్రతిరోజు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. ఆమె సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు వినడం నిజంగా బాధగా ఉంది. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ప్రతి చోటా లింగ అసమానత్వం ఉంది. మహిళలందరూ దీనిని ఖండించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది"
విలువలేనివారు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు - సినీ నటి ఖుష్బూ
“రెండు నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేని వారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ, ఇక్కడ ఒక మహిళకు జరిగిన అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారు.. మీలో కొన్ని విలువలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. అవన్నీ ఎక్కడికి పోయాయి ? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమలోని వారి గురించి ఇలా నిరాధారమైన, భయంకరమైన కించపరిచే ప్రకటనలు చేయకూడదు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు.. మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము
"శుద్ధి చెయ్యాల్సింది నదిని కాదు. వాళ్ళ బుద్ధిని. ఛీ!!! ఇంత నీచమా..." -సినీ రచయిత అబ్బూరి
రవి