శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే ! 2 m ago
భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారు
వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది టీటీడీ ఆస్తులను... భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్
8కే న్యూస్, అమరావతి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో... తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ చెప్పారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ... దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్ర ప్రదేశ్తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు... ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు కూడా ఉన్నాయన్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్థకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందన్నారు. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికే ఎందుకు ఉత్సాహపడింది? వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తామని తెలిపారు.
వారు కాపాడారా...అమ్మేశారా...?
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్ళకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందని స్పష్టంచేశారు. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు టీటీడీ ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలకులు నియమించిన పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారన్నారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అంబర్పేట కలాన్ ప్రాంతంలో స్థలం, మల్కాజిగిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్, నాందేడ్, బెంగళూరుల్లోని కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసిందని వివరించారు. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న మా పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించామని తెలిపారు. అప్పుడు వేలం ద్వారా విక్రయం ఆగిందని గుర్తుచేశారు.
ఆభరణాలు... నగలను పరిశీలించాలి
అదే విధంగా తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు నగలు, ఆభరణాలు అందచేశారన్నారు. వాటి జాబితాను కూడా పరిశీలించి... వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు సూచించారు. ఎందుకంటే స్థిరాస్తులను అమ్మేయాలని చూసినవాళ్ళు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా పెడపోకడలతో ఏవైనా అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయం మీదా దృష్టిపెట్టాల్సి ఉందన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఎటు వెళ్లింది?
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి రూ.10,500 తీసుకున్నారన్నారు. ఇందులో బిల్లు రూ.500కే ఇచ్చారని చెప్పారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని ఇప్పటికే సీఎంను కోరడం జరిగిందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారని గుర్తుచేశారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? ఆ సంస్థ ఏమిటి? ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆస్తులపై సమీక్ష అవసరం
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాకుండా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖాలుపెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందన్నారు. ఎందుకంటే నాడు పాలనలో ఉన్నవారికి ధర్మ పరిరక్షణపట్ల విశ్వాసం ఉన్నట్లు గోచరించడం లేదని చెప్పారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, ఆభరణాల వివరాలతోపాటు, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడినీ ప్రజలకు తెలియచేయడం అవసరమని స్పష్టంచేశారు. తద్వారా భక్తులకు వివరాలు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటంతోపాటు, ఆలయాల పాలక మండళ్ళు జవాబుదారీతనంతో పని చేస్తాయన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ చెప్పారు.