Revanth Reddy: అదానీని మోడీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు..! 21 d ago
అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోడీ మౌనంపై నిరసనగా ఛలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో పోలీసులు అడ్డుకున్నారు..అందుకే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడమేంటని కొందరు అనుకోవచ్చు..ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. మా నిరసన కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు, ఇంకొందరికి కడుపులో నొప్పి రావచ్చు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భారత్ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టు పెట్టారని అన్నారు. 75 ఏళ్ల పాటు కష్టపడి దేశ పరువును కాంగ్రెస్ పెంపొందించిందని చెప్పారు. వ్యాపారం చేసేందుకు అదానీ లంచాలు ఇచ్చారని అమెరికన్ దర్యాప్తు సంస్థ తెలిపింది. ప్రధాని మోడీ అదానీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ అంశాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో నిలదీశారని గుర్తు చేసారు. కానీ ప్రధాని మోడీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇవ్వడం జరిగిందని రేవంత్ పేర్కొన్నారు. అదానీ అవినీతి విచారణపై జేపీసీ వేయాలని డిమాండ్ చేసారు. అదానీ అంశంపై జేపీసీ వెయ్యకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.